వైఎస్ భారతిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి పై అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసింది టీడీపీ కార్యకర్త స్వాతి. అయితే.. ఈ సంఘటనపై రంగంలోకి దిగింది ఏపీ మహిళా కమిషన్. ఈ సందర్భంగా మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సతీమణి పై కూడా అసభ్యంగా పోస్టింగ్ లు పెడితే చంద్రబాబు ఎలా సమర్ధిస్తారు?? అని నిలదీశారు.
స్వాతి రెడ్డి పేరుతో పోస్టింగులు పెడుతున్న శ్వేతా చౌదరి లాంటి వారిని చంద్రబాబు వెనకేసుకుని రావటం దురదృష్టం అన్నారు. మహిళలు కూడా ఉన్మాదంతో సోషల్ మీడియాలో వ్యవహరించే విధంగా రాజకీయ పార్టీలు తయారు చేస్తున్నాయని.. పోస్టింగ్ కు పోస్టింగ్ సమాధానం కాదని తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాన్ని హత్యతో సమానంగా పరిగణించాలని.. అవసరమైతే కొత్త చట్టాలు తీసుకుని వద్దామని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో మార్పు రావాలని.. దీన్ని రాజకీయ రగడగా మార్చవద్దని కోరారు. రాజకీయ పార్టీలను సెమినార్ కు ఆహ్వానించ లేదని.. టీడీపీ మహిళా నాయకురాలు అనిత సెమినార్ కు వస్తానంటే ఆహ్వానిస్తామని ప్రకటించారు.