టీటీడీ చైర్మన్ పదవి అనేది రాజకీయ పునరావాస పదవి కాకూడదని అన్నారు ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లు మాత్రమే ఈ పదవికి న్యాయం చేయగలరని అన్నారు. ఇంతకుముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియమించిందని.. ఈ విషయంపై గళం విప్పిన తర్వాత 52 మంది నియామకం నిలిపివేశారని అన్నారు.
అంటే ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాస నియామకాలు గానే పరిగణిస్తుందని అర్థం అవుతుందన్నారు పురందేశ్వరి. హిందూ ధర్మం మీద నమ్మకం ఉన్న వాళ్ళనే టీటీడీ చైర్మన్ గా నియమించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈనెల 10వ తేదీన కలెక్టరేట్ల వద్ద బిజెపి ధర్నాలకు పిలుపునిచ్చింది. స్థానిక సంస్థల నిధుల మళ్లింపు పై బిజెపి ఆందోళనలు చేపట్టనుంది. ఈ మేరకు ఈ నెల 10వ తేదీన ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనలో పాల్గొననున్నారు పురందేశ్వరి.