ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల డిక్లరేషన్ విషయంలో ఇప్పటివరకూ బీజేపీ – టీడీపీలు రాజకీయం చేయడం తెలిసిందే. ఫలితంగా నోటా ను దాటి ఓట్లు సంపాదించాలని బీజేపీ భావిస్తుందని.. ఉన్న వాళ్లనైనా కాపాడుకోవాలని టీడీపీ భావిస్తోందని వైకాపా నాయకులు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ తన అభిప్రాయాన్ని క్లారిటీగా చెప్పింది!
అవును… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రైస్తవుడు అనేది తెలిసిన విషయమే! ఈ విషయంలో టీటీడీ దేవస్థానం మర్యాధపూర్వకంగా రాష్ట్ర ప్రజల తరుపున ముఖ్యమంత్రి హోదాలో జగన్ ను పట్టువస్త్రాలు సమర్పించడానికి ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. అది పూర్తిగా టీటీడీ బోర్డు ఆలోచించుకుని పంపిన ఆహ్వానం. దానికి పద్దతులు ఎక్కడా తప్పకుండా జగన్.. పూర్తిగా సంప్రదాయాలు పాటిస్తూ.. పద్దతి ప్రకారం చేసుకుంటూపోయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో జగన్ ముఖ్యమంత్రి హోదాలో పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్లడం వల్ల డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని టీడీపీ బీజేపీలు రాజకీయ రంగుపులిమి తద్వారా లబ్ధి పొందాలని భావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇలాంటి బలవంతపు డిక్లరేషన్ ను అడగడం కూడా బలవంతపు మతమార్పిడియేనని అభిప్రాయపడింది తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్!
అవును… అన్య మతస్థుల తిరుమల ఆలయ ప్రవేశ అంశాన్ని మత రాజకీయం చేయడం తగదని.. ముఖ్యమంత్రిని డిక్లరేషన్ పై బలవంతం చేయడం బలవంతపు మతమార్పిడియేనని.. ఇది రాజ్యాంగ విరుధ్ధమని.. మతసామరస్యానికి తూట్లు పొడవడమేనని తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ అభిప్రాయపడింది. సరిగ్గా ఆలోచిస్తే వీరి అభిప్రాయం నిజమనే వాదన పెరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు! మరి ఇకపై అయినా ప్రతిపక్షాలు ఈ మతరాజకీయాలు మానుకుంటారా లేక దీనివల్ల ఏమైనా ఫలితం వస్తుందని భావించి ఇంకొంతకాలం టీవీలపై పడతారా అన్నది వేచి చూడాలి!
-CH Raja