తమిళనాడు సీఎం స్టాలిన్ కు పవన్ కళ్యాణ్ ఓ విజ్ఙప్తి చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి పట్టణంలో బాణాసంచా గోదాములో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని 9 మంది దుర్మరణం చెందడం, మరో 15 మంది గాయపడటం చాలా బాధ కలిగించిందని అవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో బాణాసంచా దుకాణం యజమాని, అతని భార్య, కొడుకు, కూతురు.. మొత్తం కుటుంబం బలి కావడం శోచనీయం. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకారంగా ఉన్నట్లు తెలిసింది. నిండు నూరేళ్లు జీవించవలసిన బతుకులు ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడం విచారకరమన్నారు.
ఈ ప్రమాదం కారణంగా ఒక దుకాణం, మరో మూడు ఇళ్లు కూలిపోయి అందులో అనేకమంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఇది ఎంతో ఆందోళనకరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని, మృతి చెందిన వారి కుటుంబాలకు తగినంత నష్టపరిహారం అందజేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ను కోరుతున్నానని పవన్ కళ్యాణ్ ఓ లేఖ విడుదల చేశారు.