తాను ప్రజల కోసం పని చేసే మనిషనని.. అందుకే జీతాలు వద్దని చెప్పానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దేశం కోసం, నేల కోసం ఎంతటి కష్టాన్నైనా పడతానని చెప్పారు. తమ ప్రభుత్వం అద్భుతాలు చేస్తామని చెప్పడం లేదని, కానీ జవాబుదారీగా ఉంటుందని తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు సత్యకృష్ణ ఫంక్షన్ హాలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతలో ప్రతిభ వెలికితీయాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే తాను ఉన్నానని స్పష్టం చేశారు.
‘భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటాను. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నాను. తక్కువ చెప్పి ఎక్కువ పనిచేయాలనుకుంటున్నాను. అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదు. రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి. పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు. రూ.600 కోట్లతో రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అవే నిధులు ఇక్కడ ఉపయోగిస్తే జిల్లా అభివృద్ధి అయ్యేది. నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు. పర్యావరణశాఖను బలోపేతం చేస్తాం. పర్యావరణ కాలుష్యంపై జవాబుదారీతనం తీసుకువస్తాం.’ అని పవన్ కల్యాణ్ అన్నారు.