శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ ఇటీవల ఓ నిరసనలో పాల్గొన్న జనసేన నేతపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. శ్రీకాళహస్తిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న జనసేన కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. ఈ నిరసనను ఆపివేసేందుకు రంగంలోకి దిగిన వన్ టౌన్ సీఐ అంజు యాదవ్ ఓ కార్యకర్తపై చేయి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో సీఐ అంజు యాదవ్ పై వైసీపీ కార్యకర్తలా పనిచేస్తుందని జనసేన శ్రేణులు అగ్రహాం వ్యక్తం చేశారు. తాజాగా మానవ హక్కుల కమిషన్ కూడా ఈ విషయంపై స్పందించింది. సదరు సీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 17న తిరుపతికి వెళ్ళనున్నారు. జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్న సీఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఆయన ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ పర్యటనకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.