టీడీపీలో యువనేతగా, మాటల తూటాలతో ప్రతిపక్షంపై విరుచుకుపడే ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా పేరున్న ఓ నేత ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోవడం టీడీపీ వర్గాల్లో చర్చకు తావిస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను రాజకీయంగా ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతోంది. రెండున్నర దశాబ్దాలకు పైగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ కోసం ఎప్పటికప్పుడు బలమైన వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. అయినా తనకు పార్టీలో రావాల్సినంత గుర్తింపు రాలేదని.. మంత్రి పదవి ఇవ్వలేదన్న బాధ ఆయనలో ఉంది.
ఇక ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, కీలకమైన ఏపీసీ చైర్మన్ పదవిని సైతం బాబు ఆయనకే కట్టబెట్టినా ఆయన నోరు మాత్రం మెదపడం లేదు. విచిత్రం ఏంటంటే పార్టీ గెలిచిన 1999లో ఆయన ఓడిపోయారు. పార్టీ ఓడిన 2004, 2009 ఎన్నికల్లో కేశవ్ గెలిచారు. రాష్ట్ర విభజన జరిగాక పార్టీ గెలిచిన 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో ఆయన మంత్రి పదవి ఆశలు నీరుగారిపోయాయి. అయినా చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు ఏపీలో పార్టీ పరంగా అనేక పనులకు వాడుకున్నారు.
పరిటాల సునీతకు మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు కనీసం మూడేళ్ల తర్వాత అయినా మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు. చివరకు ఇవ్వలేదు. ఇక గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది.. మహామహులు ఓడిపోయారు. అయితే అనూహ్యంగా ఉరవకొండలో కేశవ్ గెలిచారు. అయితే చంద్రబాబు పార్టీకి మిగిలిన ఈ ఒకే ఒక్క కీలక పదవి అయిన పీఏసీ చైర్మన్ పదవిని కేశవ్‌కు కట్టబెట్టారు. ఈ పదవి కోసం పార్టీ తరపున గెలిచిన సీనియర్లలో చాలా మంది పోటీ పడినా బాబు మాత్రం కేశవ్‌కు ఇచ్చారు.
అయితే కేశవ్ అనూహ్యంగా సైలెంట్ అవ్వడంతో చంద్రబాబుతో పాటు టీడీపీ సీనియర్లు సైతం ఆయనపై గుస్సాగా ఉన్నారు. ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాబు తనను పట్టించుకోలేదన్న విషయం మనసులో పెట్టుకునే కేశవ్ ఇలా వ్యవహరిస్తున్నారని టాక్.. మరోవైపు ఆయనకు హైదరాబాద్‌లో వైసీపీ నేతలతో కూడా వ్యాపారాలు ఉన్నాయని.. అందుకే ఆయన లోపాయికారిగా సైలెంట్‌గా ఉంటూ ఆ పార్టీకి పరోక్షంగా సహకరిస్తున్నారని కూడా కొందరు టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఏదేమైనా పయ్యావుల మౌనం అసెంబ్లీలో, బయటా టీడీపీకి మైనస్‌గా మారింది.