ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా కేంద్రం అయిన సచివాలయంలో పని చేసే ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీ కి సంబంధించిన జీవోలను వ్యతిరేకిస్తు పెన్ డౌన్, యాప్ డౌన్ చేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పరిపాలన కేంద్రం అయిన సచివాలయంలో ప్రభుత్వ కార్యకలాపాలు అన్ని కూడా పూర్తిగా నిలిచిపోయాయి. సచివాలయంలో కంప్యూటర్లన్నీ షట్ డౌన్ చేసి ఉద్యోగులు అందరూ నిరసన వ్యక్తం చేశారు.
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. తమ డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ చేసిన చర్చల వ్యాఖ్యలపై కూడా ఉద్యోగులు స్పందించారు. ఈ రోజు ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ సమావేశం అవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తో చర్చలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే ఛలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా అరెస్టు చేసిన ఉద్యోగులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.