టూరింగ్ టాకీసు : ప్రియ‌మైన వాన‌కు..ప్రియ‌మైన శేఖ‌ర్ కు

-

వానొచ్చిన ప్ర‌తిసారీ శేఖ‌ర్ సినిమాలో పాట‌లే గుర్తుకు వ‌స్తాయి.అల్ల‌రి చేస్తాయి. గాలివాన‌ల మ‌ధ్య హీరోయిన్ అందాలు బంధించ‌డం శేఖ‌ర్ తోనే సాధ్యం. అందం అయిన గోదావ‌రి తీరాల్లో అంద‌మ‌యిన క‌థ‌కు అంద‌మ‌యిన భావోద్వేగాలు జోడించడం ఆయ‌న‌కే తెలుసు. ఈ దేశంలో యువ‌త‌కు మంచి రోజులున్నాయి కాస్త ప్రోత్స‌హించండి అని చెప్ప‌డం కూడా ఆయ‌నే తెలుసు .. ఆ హ్యాపీడేస్ మ‌ళ్లీ వ‌స్తాయి మ‌ళ్లీ మ‌ళ్లీ ఆయ‌న‌తోనే ఉంటాయి కూడా! అనండిక అరెరె అరెరె మ‌న‌సే జారే (ఈ పాట వ‌న‌మాలి రాశారు..వేటూరి కాకుండా ఏ కొద్దిమందితోనో ఆయ‌న ప‌నిచేశారు పాట‌ల విష‌య‌మై) ఏదేమ‌యినా శేఖ‌ర్ అంతా నీ మ‌యాలోనే రోజూ నీ పాట స్మ‌ర‌ణే !

వ‌చ్చే వ‌చ్చే న‌ల్ల‌మ‌బ్బుల్లారా గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా! వేటూరితో ఈ పాట రాయించుకుని పొంగిపోయాడు శేఖ‌ర్. పూర్తి పేరు శేఖ‌ర్ క‌మ్ముల.ప్రేమ క‌థ‌ల్లో ఉండే సున్నిత‌త్వం, ఆలోచింప‌జేసే గుణం, బాధ, విర‌హం ఇవ‌న్నీ ఆయ‌న సినిమాల్లో ఉంటాయి. అవ‌న్నీ మోతాదు దాటి ఉండ‌వు. మోతాదులోనే ఉంటాయి.ఆయ‌న పాట రాయించినా మాట చెప్పించినా అవ‌న్నీ ఆధునిక జీవితాల‌ను ప్ర‌తిబింబింప జేస్తూనే మ‌న సంస్కృతిని గుర్తు చేస్తాయి. సంస్కృతికి నీరాజనం ప‌లికేలా ఉంటాయి. పాట అయినా మాట అయినా ద్వంద్వార్థాల‌కు అతీతంగా ఉంటాయి. ఆయ‌నకు వేటూరి అంటే ఎంతో ఇష్టం. పాట ఎప్పుడు రాయించుకున్నా ఆయ‌న‌తోనే!

నువ్వేనా నా నువ్వేనా…అంటూ ఆనంద్ కు పాట రాయించాడు శేఖ‌ర్.. జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంద‌ర్భం ఒక‌టి ఆయ‌న వేటూరితో చేసిన ప్ర‌యాణంతోనే సాధ్యం అయింది.శేఖ‌ర్ సినిమాల్లో హీరోయిజం ఉండ‌దు.కేవ‌లం ఆ పాత్ర‌కు సంబంధించి కొన్ని భావోద్వేగాలు మాత్ర‌మే ఉంటాయి. చిరు అంటే భ‌లే ఇష్టం ఆయ‌న‌కు! ఆ ఇష్టాన్ని ఎన్నిసార్లు అయినా చెబుతూనే ఉంటాడు.

త‌న ల‌వ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌లకు అతిథిగా వ‌చ్చి, ఆయ‌న‌ను దీవించి వెళ్లారు. చిరు ఒకే ఒక్క మాట చెప్పారు.. స‌న్న‌గా రివ‌టలా ఉండే కుర్రాడి గురించి ఎప్పుడు గుర్తు చేసుకున్నా న‌వ్వొక్క‌టే గుర్తుకు వ‌స్తుంద‌ని.. ఆయ‌న న‌వ్వు ఆయ‌న ల్యాండ్ మార్క్.. అదొక సిగ్నేచ‌ర్ సైన్.

గోదావ‌రి సినిమా విష‌యంలోనూ అంతే! ఈ సారి కూడా ఆయ‌న ఎన్నో గొప్ప పాట‌లు రాయించారు. ముఖ్యంగా మాన‌సా వాచా నిన్నే వ‌ల‌చా పాట‌ను ఎంత గొప్ప‌గా రాయించారో! వేటూరి ఒకే ఒక్క‌మాట అన్నారట‌! ఈ పాటలు గోదావ‌రి తీరంలో ఉంటూ రాస్తే ఎంత బాగుంటుంది అని! స‌మాజంలో చిన్న చిన్న మార్పులు ఆశించే లీడ‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల.. ప్రేమ క‌థ‌ల‌ను లీడ్ చేయ‌గ‌ల లీడ‌ర్.. సున్నిత భావోద్వేగాల‌ను ప‌రిధి దాట‌నివ్వ‌క తీయ‌గ‌ల స‌మ‌ర్థుడు శేఖ‌ర్ క‌మ్ముల.. డియ‌ర్ స‌ర్ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ బ‌ర్త్ డే

– టూరింగు టాకీసు – మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news