ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల పోలింగ్ స్టేషన్‌లో ఈవీఎం యంత్రాలను ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , అతడి సోదరుడి కోసం రెండు రాష్ట్రాల పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటికే పిన్నెల్లిని ఏ1గా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఐపీలోని143, 147, 448, 427, 353, 452, 120బి, తోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టం, ఆర్పీ చట్టం 131, 135లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలోనే పిన్నెల్లిని అరెస్ట్ చేయనున్నట్టు సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
మరోవైపు నరసారావుపేట కోర్టులో లొంగిపోనున్నారనే వార్తలు వినిపించిన కొద్ది సేపటికే తాజాగా ఏపీ హైకోర్టు లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున పిటిషన్ దాఖలు అయింది. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హై కోర్టులో విచారణ జరుగనుంది.