సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కారణంగా ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను విచారించేందుకు ఒంగోలు పోలీసులు సోమవారం హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే, తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనని, డిజిటల్ మోడ్‌లో విచారణకు హాజరు అవుతానని రామ్ గోపాల్ వర్మ పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విచారణ అధికారి సీఐ శ్రీకాంత్ స్పందిస్తూ.. ‘విచారణాధికారిగా నాకున్న ఎంక్వైరీ ఆఫీసర్ పవర్స్ మేరకు డిజిటల్ విచారణకు నేను అంగీకరించే ప్రసక్తే లేదు.
ఆర్జీవీ కోరిన విధంగా ఇప్పటికే విచారణకు హాజరయ్యేందుకు రెండు సార్లు అవకాశం ఇచ్చాం. వాటిని ఆయన సద్వినియోగం చేసుకోలేదు. పోలీసులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించారు. చట్టప్రకారం ఆయన్ను అరెస్ట్ చేసి తీరుతాం’ అని సీఐ స్పష్టం చేశారు. కాగా, ఆర్జీవీ ఇంట్లో లేరని సిబ్బంది చెప్పినా.. వచ్చే వరకు వేచి చూస్తామని పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఏ క్షణంలో అయినా ఆర్జీవీ అరెస్టు జరిగేలా కనిపిస్తోంది.