భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 08న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ లో మంత్రులు, ఉన్నతాధికారులు, కూటమి ప్రజా ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ కలిసి కట్టుగా పని చేసి జనవరి 08న విశాఖలో జరుగనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ పర్యటనను విజయవంతం చేయాలని కోరినట్టు మంత్రి ట్వీట్ చేసారు.
“ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారిగా ప్రధాని ఏపీ కి వస్తున్నారు. ఇదొక చారిత్రాత్మక పర్యటన కాబోతుంది. ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లను సమీక్షించాను. పలు సూచనలు చేశాను. సభా స్థలాన్ని పరిశీలించి జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించాను” అని రాసుకొచ్చారు. ఈనెల 08న ప్రధాని మోడీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం రోడ్డు షోతో పాటు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ప్రధాని మోడీ.