టీడీపీలో ఆ లేడీ లీడ‌ర్ మంట పెట్టేస్తోందిగా…!

క‌ర్నూలు టీడీపీలో రేగిన అసంతృప్తి, ఆధిప‌త్య రాజ‌కీయాలు మ‌రింత ముదురుతున్నాయి. మాజీ మంత్రి, దూకుడుకు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న భూమా అఖిల ప్రియ‌కు, టీడీపీ సీనియ‌ర్ నేత ఏవీ సుబ్బారెడ్డికి మ‌ధ్య మ‌రింత దూరం పెరిగింది. టీడీపీ అధికారంలో ఉన్న నాటి నుంచి ఇరు ప‌క్షాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. త‌న‌కు ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఇవ్వాల‌ని ఏవీ సుబ్బారెడ్డి ఎప్ప‌టి నుంచో కోరుతున్నారు. అదేస‌మ‌యంలో భూమా కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వ‌డంపైనా(నంద్యాల‌-ఆళ్ల‌గ‌డ్డ‌) ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే, ఆళ్లగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం అమ్మ అని, నంద్యాల నియోజ‌క‌వ‌ర్గం నాన్న‌-అని చెబుతున్న భూమా అఖిల ప్రియ రెండు చోట్లా త‌న ఆధిప‌త్యాన్ని కొన‌సాగించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది చాలా దూరం వెళ్లి.. ఏబీ సుబ్బారెడ్డికి, భూమా అఖిల ప్రియ‌కు మ‌ధ్య వార్ ఘోరంగా సాగుతోంది. ఈ క్ర‌మంలోనే ఇరు ప‌క్షాలు ఒక‌రిపై ఒక‌రు దాడులు చేసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. కొన్నాళ్ల కింద‌ట.. త‌న‌పై హ‌త్యాయత్నం చేస్తున్నార‌ని ఏబీ సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో నిఘా పెట్టిన పోలీసులు ఈ హ‌త్యాయత్నం చేస్తున్న విష‌యం వాస్త‌వ‌మేన‌ని గుర్తించి.. అఖిల ప్రియ భర్త ప్ర‌మేయ ముందని తేల్చారు.

ఈ క్ర‌మంలో కేసు కూడా న‌మోదు చేశారు. దీనికి సంబంధించి అరెస్టులు మాత్రం చేయ‌లేదు. తాజ‌గా  ఏవీ సుబ్బారెడ్డి, కుమార్తె జస్వంతి రెడ్డిలు జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిశారు. తనను హతమార్చేందుకు కుట్ర పన్నిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌లను త్వరగా అరెస్టు చేయాలని ఏవీ విజ్ఞప్తి చేశారు. దీనికి ఎస్పీ ప‌రిశీలిస్తాన‌ని స‌మాధానం చెప్పారు. దీంతో భూమా అఖిల అలెర్ట్ అయ్యారు. త‌న‌కు కూడా ఏవీ సుబ్బారెడ్డి నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని ఎదురు దాడికి దిగారు. దీంతో మ‌ళ్లీ క‌ర్నూలు టీడీపీలో వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు, హ‌త్యాయ‌త్నాల ఆరోపణ‌లు ఊపందుకున్నాయి. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ప‌రిశీలించి ఇరు ప‌క్షాల‌ను దారిలో పెట్ట‌క‌పోతే.. క‌ష్ట‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.