ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. అధికార వైస్సార్సీపీకి ఊహించని షాక్ తగిలింది. దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలసి పనిచేయబోతున్నారు. ఆయన శనివారం రోజున టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మూడు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు పీకే బృందం పనిచేయనున్నట్లు తెలిసింది.
2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అధికారంలోకి తేవడంలో పీకే కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. వ్యూహకర్తగా పనిచేస్తున్న పార్టీని ఎన్నికల్లో గెలిపించేందుకు ఎంత దూరమైనా వెళ్తారని, ఎలాంటి వ్యూహాలైనా రచిస్తారన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. 2019 ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వ విధ్వంసకర విధానాలు, అతి త్వరలోనే అత్యంత చెడ్డపేరు తెచ్చుకోవడం చూసి ఆయన అంతర్మధనానికి గురయ్యేవారని రాజకీయవర్గాల్లో టాక్. గతంలో తాను అధికారంలోకి తెచ్చిన ఏ పార్టీ ప్రభుత్వమూ ఇంతగా చెడ్డపేరు మూటగట్టుకోలేదన్న భావన చాలా బలంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇప్పుడు పీకే టీడీపీ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నారా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.