ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆస్తి విలువలు అధ్వానంగా పడిపోయాయని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా డామేజ్ చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్న సమయంలో ఒక ఇంటి విలువ 14 నుంచి 15 లక్షల రూపాయలు ఉండగా, ఇప్పుడు అదే ఇంటిని ఐదు లక్షలకు అమ్ముదామన్నా కొనేవారు లేరని అన్నారు.
పిల్లల పెళ్ళి చేయడానికి ఇల్లు అమ్మాలని భావిస్తున్న వారికి, ఇల్లు కొనేవారు లేక నిరాశే ఎదురవుతుంది అని అన్నారు. సదరు ఇంటి యజమానికి ఈ ప్రభుత్వం ద్వారా 40,000 లబ్ధి చేకూరగా, ఆయనకున్న మద్యం అలవాటు ద్వారా 80 వేల రూపాయలను జగన్ మోహన్ రెడ్డి సర్కారు లాక్కోందని, జగన్ మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి ద్వారా ఏడాదికి 13 వేల చొప్పున, ఐదేళ్లలో 60 వేల రూపాయలు ఇచ్చాడనుకుంటే, అతడి ఆస్తి విలువ 9 లక్షల రూపాయలు పడిపోయిందని తెలిపారు.
విద్యుత్ చార్జీల రూపంలో, ఆసుపత్రిలో మందుల ద్వారా, మద్యం ద్వారా ప్రజలను దోచుకున్న విషయాలపై గతంలో మాట్లాడినప్పటికీ, పతనమైన ఆస్తి విలువ గురించి ఇప్పటి వరకు రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడలేదని రఘురామకృష్ణ రాజు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎకరా భూమి 50 లక్షల రూపాయలకు తక్కువగా ఎక్కడా లభించేది కాదని, ఇప్పుడు 20 లక్షలకు కూడా కొనేవారు లేరని అన్నారు.