పూసపాటి వంశీయుల వర్గపోరుతో మాన్సాస్ ప్రతిష్ఠ మసకబారుతోందా…?

-

లక్షల మందికి విద్యాదానం చేసిన మాన్సాస్ ప్రతిష్ఠ మసకబారుతోందా? నాడు బాబాయ్- నేడు అమ్మాయి నిర్ణయాలే మాన్సాస్‌ని మకిలి పట్టిస్తున్నాయా? ట్రస్ట్‌ను కంటికి రెప్పలా కాపాడాల్సిన పూసపాటి వంశ వారసులే.. ఆ సంస్థ విచ్ఛిన్నానికి కారణమవుతున్నారా?

విజయనగరాన్ని విద్యలనగరంగా తీర్చిదిద్దేందుకు మాహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్సెస్‌-మాన్సాస్ ట్రస్టును 1958లో పీవీజీ రాజు స్థాపించారు.105 ఆలయాలు, వేల కోట్లు విలువైన 14,800 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ ట్రస్ట్‌కి పూసపాటి వంశీయులే ధర్మకర్తలు. 2016లో ఆనంద గజపతిరాజు మరణం తరవాత పీవీజీ రాజు రెండో కుమారుడు.. అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా ఆ పదవిని చేపట్టారు. ఎవరూ ఊహించని విధంగా అశోక్ గజపతిరాజును ఆ పదవి నుంచి తొలగించి.. ఆయన స్థానంలో ఆనంద గజపతిరాజు మొదటి భార్య ఉమా గజపతిరాజు కూమార్తె సంచయితను నియమించింది ప్రభుత్వం.

ఈ మార్పులపై రాజకీయ రగడ, కోర్టుల్లో వివాదాలు నడుస్తున్న సమయంలోనే మరో గొడవ తెరపైకి వచ్చింది. ట్రస్ట్‌ చైర్మన్‌గా సంచయిత తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. మహారాజా కాలేజీని ప్రైవేటీకరించాలని మాన్సాస్‌ ట్రస్ట్‌ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అశోక్‌ గజపతిరాజుతోపాటు కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ట్రస్ట్‌ చైర్మన్‌గా సంచయిత బాధ్యతలు చేపట్టడం ఇష్టం లేని పూసపాటి వంశీయుల్లో కొందరు మాన్సాస్‌ను అసలేం చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇదే సమయంలో MR కాలేజీ ప్రైవేటీకరణ ప్రతిపాదన ఇప్పటిది కాదనే వాదన కలకలం రేపుతోంది. అశోక్‌ గజపతిరాజు ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన సిద్ధమైనట్టు సమాచారం. విద్యార్థులు ఇబ్బంది పడతారని నాడు ఆ నిర్ణయాన్ని అశోక్‌ వెనక్కి తీసుకున్నారట. ప్రస్తుత వివాదంలో ఆ విధంగా ఆయన కూడా ఎంట్రీ ఇచ్చారు. కాకపోతే ప్రైవేటీకరణపై లాభనష్టాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. బాబాయ్ వ్యాఖ్యలపై సంచయిత ట్విటర్ వేదికగా ఫైర్ అయ్యారు. 2017లో అశోక్‌ తీసుకున్న నిర్ణయం ఆధారంగానే ఇప్పుడు ముందుకెళ్తున్నట్టు వివరణ ఇవ్వడంతో అంతా అవాక్కయ్యారు.

గతంలో అశోక్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు కోటలో గల మహారాజా హైస్కూల్‌ను ఎయిడెడ్‌ నుంచి అన్‌ ఎయిడెడ్‌గా మార్చారు. ఎంఆర్‌ బీఈడీ కాలేజీని ప్రైవేటీకరించారు. ఆర్థిక వనరుల కొరతను కారణంగా చూపించి.. కోటలో ఉన్న ఉమెన్స్‌ కళాశాలను కో-ఎడ్యుకేషన్‌ కాలేజీగా మార్చేశారు. మాహారాజా పీజీ కాలేజీలో కొన్ని కోర్సులను ఎత్తేశారు. ఫీజులు భారీగా పెరిగాయి. మాన్సాస్‌ విద్యా సంస్థల్లో కార్పొరేట్‌ కాలేజీల తరహాలో ఫీజులు వసూలు చేస్తున్నారని అప్పట్లోనే పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. మాన్సాస్‌లో సంస్కరణల ముసుగులో అశోక్‌ అనేక మార్పులు చేశారని.. ఇప్పుడు సంచయిత కూడా బాబాయ్‌ బాటలోనే వెళ్తున్నారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version