ఎవరి ట్రాప్ లోను ఎంవివి సత్యనారాయణ పడొద్దు – రఘురామ

-

విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఎవరి కుట్రలోనూ భాగస్వామి కావద్దని, ప్రస్తుతం ఆయన అంటే గౌరవం లేకపోయినా కోపమయితే లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. గురువారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై, వాయిదా పడిన అనంతరం సెంట్రల్ హాల్లో సహచర ఎంపీలకు తాను తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అందజేస్తుండగా, అక్కడికి చేరుకున్న విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ తనను తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారని అన్నారు.


గురువారం రఘురామకృష్ణ రాజు గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పార్లమెంటు సెంట్రల్ హాల్లో అరవింద్ సావంత్ గారు, అనిల్ దేశాయి గారితో పాటు మరికొంతమంది సహచర ఎంపీలతో కలిసి ఉన్న తన వద్దకు సత్యనారాయణ వచ్చి… నా కుటుంబ సభ్యుల అపహరణను నాటకమని అంటావా?, నా భార్య గురించి మాట్లాడుతావా??, నిన్ను లేపించి వేస్తాను అంటూ నోటికొచ్చినట్లు బండ బూతులు తిట్టారని, గతంలోనూ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఇలాగే తనను అసభ్య పదజాలంతో దూషించారని అన్నారు. ఆ విషయాన్ని లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారి దృష్టికి తీసుకు వెళ్ళానని, అయినా గోరంట్ల మాధవ్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.

ఇప్పుడు కూడా చర్యలు తీసుకుంటారా? లేదా?? అన్నది తెలియకపోయినప్పటికీ, తాను ఈ సంఘటనను వివరిస్తూ స్పీకర్ గారిని ఫిర్యాదు చేశానని తెలిపారు. ఎంపీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను అపహరించడం వెనుక కుట్ర కోణం ఉందని, ఇది కేవలం డబ్బుల కోసం జరిగిన కిడ్నాప్ కాదని పేర్కొంటూ, ఆయనకు బలం చేకూరే విధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అదే నెల 17వ తేదీన లేఖ రాయడం జరిగిందని, కిడ్నాప్ వెనుకనున్న కుట్ర కోణాన్ని చేధించాలని కోరుతూ సత్యనారాయణ మంచి కోరే తాను లేఖ రాశానని, తాను రాసిన లేఖ అందినట్లుగా పేర్కొంటూ అదే నెల 26వ తేదీన ప్రధానమంత్రి గారే స్వయంగా సంతకం చేస్తూ లేఖ రాశారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news