తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే నీటి కోసం దొంగ యుద్ధాన్ని చేస్తావా? నీతి లేని నాయకుడా?? అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు మండిపడ్డారు. అమ్మా… ఎంతకు తెగించారు…ఇన్నాళ్లు చెట్టా పట్టాలు వేసుకొని తిరిగి, ఇప్పుడు దొంగ నీటి యుద్ధం చేస్తావా? నీతి లేని నాయకుడా?? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తలుచుకుంటేనే అసహ్యం వేస్తోందని, నీటి కోసం దొంగ యుద్ధం చేసే నీతి లేని నాయకులకు త్వరలోనే సమాధానం చెబుదామని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, ఆంధ్రులకు కూడా ఈ ఫలితాల పై ఉత్కంఠ ఉంటుందన్నారు. లబ్ద ప్రతిష్టలైన ఇద్దరు రచయితల వర్ధంతి ఒకే రోజు కావడం యాదృచ్ఛికమని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. కన్యాశుల్కం వంటి ప్రసిద్ధ నవలను రాసిన గురజాడ వెంకట అప్పారావు గారి వర్ధంతి నేడని ఆయన తెలిపారు. దేశమంటే మట్టికాదోయ్… దేశమంటే మనుషులోయ్, వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ అన్న గురజాడ గారు విజయనగరం మహారాజా కాలేజీలో అధ్యాపకునిగా సేవలందించారని, విజయనగరంలో కళలు విరజిల్లేవని పేర్కొన్న ఆయన, అశోక గజపతిరాజు తాత గారి హయాంలో గురజాడ అప్పారావు గారు ఎన్నో గొప్ప రచనలు చేశారన్నారు.