షర్మిలపై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి తగాదాల వల్ల వై.యస్. వివేకానంద రెడ్డి హత్య జరగలేదని, రాజకీయ విభేదాల వల్లే తన చిన్నాన్న హత్య జరిగినట్లుగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి సోదరీమణి వై.యస్. షర్మిల గారు పేర్కొన్నారని రఘురామకృష్ణ రాజు గుర్తు చేశారు. షర్మిల ప్రకటన ఆధారంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉన్నట్లుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆరోపించారని తెలిపారు.
వివేకానంద రెడ్డి గారి హత్య అనంతరం, ఆ హత్యను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేయించినట్లుగా పేర్కొంటూ సాక్షి దినపత్రికలో నారా సుర రక్త చరిత్ర అనే వార్తా కథనాన్ని ప్రచురించిందని, ఈ హత్య గురించి ఏమైనా మాట్లాడే హక్కు నారా లోకేష్ గారికి ఉన్నదని తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని, ఎందుకంటే నారా కుటుంబ పరువును దిగజార్చే విధంగా సాక్షి దినపత్రికలో వార్తా కథనాన్ని వండి వార్చడం జరిగిందని అన్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య అనంతరం సీబీఐ తన విచారణలో భాగంగా పలువురిని విచారించిందని, సీబీఐ అధికారులు సాక్షులు ఇచ్చే వాంగ్మూలాన్ని మాత్రమే నమోదు చేస్తారని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సీఐడీ మాదిరిగా తప్పుడు పనులను చేయరని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం గారిని విచారించి ఆయన వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు నమోదు చేశారని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిరోజు జగన్ మోహన్ రెడ్డి గారి నివాసంలో మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగేదని, వివేక గారి హత్య జరిగిన రోజు సమావేశంలో తనతో పాటు సాంబశివారెడ్డి, డి కృష్ణ, జివిడి కృష్ణమోహన్ గార్లు పాల్గొన్నట్లు చెప్పారని పేర్కొన్నారు.