అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాదని, ఆయన రాసిన రాజ్యాంగాన్ని చదివి దాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణ రాజు గారు సూచించారు. అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించకుండా, సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, ఒక పార్లమెంటు సభ్యుడన్న గౌరవం లేకుండా తనను హింసించి జగన్ మోహన్ రెడ్డి గారు ఆనందించారని, అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభించే ముందే ఆయన రాసిన రాజ్యాంగాన్ని చదివి, దాన్ని అనుసరించే ప్రయత్నం చేయాలని, అదే అంబేడ్కర్ గారికి జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చే నిజమైన నివాళి అని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు.
అంబేడ్కర్ గారి విగ్రహ ప్రారంభోత్సవ సభలో ఆ… చంద్రబాబు నాయుడు, దత్త పుత్రుడు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 దుష్ట చతుష్టయమనే వెకిలి మాటలను మాట్లాడవద్దని, అంబేడ్కర్ గారి గురించి మీకేమైనా నాలుగు మాటలు తెలిస్తే చెప్పండని, అంబేడ్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సభను రాజకీయ సభగా మార్చకండి అని సూచించారు. ఎస్సీ సామాజిక వర్గానికి ఎంతో చేశానని అబద్దాలను చెబితే చెప్పుకోండి కానీ, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల గురించి, చంద్రబాబు నాయుడు గారిపై నమోదు చేసిన అక్రమ కేసులను ప్రస్తావించి, సభకు రాజకీయ రంగు పులమకండని కోరారు. మీకు అంబేడ్కర్ గారి గురించి తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పి అంబేడ్కరిస్టులను నాలుగు మంచి మాటలు మాట్లాడనివ్వండని అన్నారు.