టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రీం కోర్టులో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల అదనంగా జైలులో గడపాల్సిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమని రఘురామకృష్ణ రాజు గారు వ్యాఖ్యానించారు. నాట్ బిఫోర్ మీ అనే అధికారం న్యాయమూర్తులకు ఉన్నదని, గతంలో తన కేసులలో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని, న్యాయమూర్తులు పారదర్శకంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇది ఒక సంకేతం అని అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ లో A36 గా ఉన్న సత్యప్రసాద్ గంటా, ఆగస్టు మాసంలో ముందస్తు బెయిల్ అడిగినప్పుడు నిరాకరిస్తే ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారని, అక్టోబర్ మూడవ తేదీన ఆ కేసు వాదనలు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం విననున్న నేపథ్యంలో, చంద్రబాబు నాయుడు గారి కేసు కూడా అదే బెంచ్ కు కేటాయిస్తారా?, లేకపోతే మరొక బెంచ్ కు కేటాయిస్తారా?? అన్నది ఆసక్తికరంగా మారిందని అన్నారు.
బుధవారం నాడు చంద్రబాబు నాయుడు గారి అభిమానుల ఆశలు అడియాశలు అయ్యాయని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ముందు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూత్రా గారు తీవ్ర ప్రయత్నాన్ని చేశారని, అక్టోబర్ మూడవ తేదీన వాదనలను వినడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంగీకరిస్తూ, తగిన బెంచ్ కు కేటాయిస్తామని తెలిపారని రఘురామకృష్ణ రాజు గారు వెల్లడించారు.