కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు సమావేశం కావడం తమ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తుందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. అమిత్ షా గారికి, లోకేష్ గారికి మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా సోషల్ మీడియాలో తమ పార్టీ నేతలు పోస్టులను పెడుతున్నారని, పురంధేశ్వరి గారు చొరవ తీసుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఆ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎందుకు పాల్గొంటారని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.
ఒకే సమయంలో కిషన్ రెడ్డి గారు, పురంధేశ్వరి గారు, లోకేష్ గారు సమయం అడిగి ఉంటారని, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సమయాభావం వల్ల అమిత్ షా గారు వారితో సమావేశమై సమస్యలను తెలుసుకొని ఉంటారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వెనుక కేంద్రం కుట్ర ఉందనే విధంగా మంత్రులు సత్తిబాబు గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ గారు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కేంద్ర పరిధిలోనే ఈడి, ఐటీ శాఖలు ఉంటాయని, తాను లండన్ లో ఉండగా చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు అరెస్టు చేశారని జగన్ మోహన్ రెడ్డి గారు పేర్కొనడం పరిశీలిస్తే… అరెస్టు వెనుక కేంద్రం కుట్ర ఉందని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు.