రుషికొండ సందర్శనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించదని రఘురామకృష్ణ రాజు వెల్లడించారు. రుషికొండపై నిర్మిస్తున్నది పర్యాటకశాఖ రిసార్ట్ కాదని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి నివాస సముదాయమని, జగన్ మోహన్ రెడ్డి తన భార్యతో నివసించేందుకు భారీ భవనాన్ని నిర్మించడంతో పాటు, అధికారులతో సమావేశం అయ్యేందుకు ప్రత్యేక సమావేశ మందిరాన్ని కూడా నిర్మించుకున్నారని అన్నారు.
రుషికొండను పవన్ కళ్యాణ్ గారు సందర్శిస్తే ఈ విషయం వెలుగులోకి వస్తుందని, అందుకే ఆయన్ని రుషికొండ సందర్శించేందుకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక ప్రాంతంలో నివసిస్తే దాన్ని రాజధాని అంటారనుకుంటే అది పిల్లవాడి చేష్టలే అవుతుందని, తనకు తాను పిల్లవాడుగా చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి గారు ఒకవేళ అలా భావిస్తున్నారనుకుంటే, ఆయన వందిమాగాదులు కూడా అలాగే ప్రచారం చేయడం సిగ్గుచేటు అని అన్నారు. మంత్రులు, తమ పార్టీ నాయకులు చేస్తున్న రాజధాని ప్రచారానికి భయపడే ఉత్తరాంధ్ర ప్రజలు ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పట్టారని, అమరావతి ఆర్ -5 జోన్ పై, ప్రధాన కేసుతో పాటే సుప్రీంకోర్టు వాదనలు వినాలని అన్నారు. ఇక రుషికొండపై తీర్పు వెలువడితే, సుప్రీం కోర్టు లేదంటే హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ ను తాను దాఖలు చేస్తానని రఘురామకృష్ణ రాజు తెలిపారు.