జగన్ మోహన్ రెడ్డిపై తాను చేసిన పోరాటమే తనకు శాపం అయ్యిందేమోననిపిస్తోందని రఘురామకృష్ణ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ఆపేక్ష లేకుండా, రాష్ట్ర ప్రజల మేలు కోసమే తాను పోరాటం చేశానని, ఎందరెందరో పార్టీలను పెట్టుకుంటున్నారని, తనకు రాజకీయంగా స్వార్థం ఉండి ఉంటే, ఏమో తాను కూడా పార్టీ పెట్టి ఉండే వాడినేమోనని అన్నారు. కానీ తనకు అటువంటి స్వార్థం లేదని, తాను మనసా వాచా కర్మణా కోరుకున్నది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, శ్రామికుడైన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మాత్రమేనని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అంటూ జగన్ మోహన్ రెడ్డి గారు ఎగతాళి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ముసలోడు అని చెబుతున్న నారా చంద్రబాబు నాయుడు ఎండలో రోజుకు మూడు బహిరంగ సభలకు హాజరవుతుంటే, ఏసీ బస్సులో ప్రయాణం చేస్తూ ప్రసంగించే సమయంలో అటువైపు ఇటువైపు కూలర్లను పెట్టుకొని ఒక్క సభలో పాల్గొనే జగన్ మోహన్ రెడ్డి గారు యువకుడా? అంటూ ప్రశ్నించారు. ఎవరు కుర్రాల్లో… ఎవరు యువకులో, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన వారు ఎవరో ప్రజలే ఆలోచించాలని రఘురామకృష్ణ రాజు గారు కోరారు. కూటమి కలవాలి, గెలవాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు అవిశ్రాంతంగా ప్రజల్లో ఉంటూ పోరాటం చేస్తున్నారన్నారని, ఒంట్లో బాగా లేకపోయినా హైదరాబాదుకు వచ్చి వెంటనే తిరుగు ప్రయాణమయ్యారని, ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజా క్షేత్రంలో ఉండి పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారని రఘురామకృష్ణ రాజు తెలిపారు.