ఓటు అనేది ఎక్కడో ఒక్కచోట మాత్రమే ఉండాలని, రెండు ప్రాంతాలలో ఉండడం కరెక్టు కాదని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు దాఖలు చేసిన అఫిడవిట్ లో అనిల్ కుమార్ రెడ్డి గారికి, మాలినీ రెడ్డికి పులివెందులలోనే ఓటు హక్కు ఉన్నట్లు స్పష్టమైనదని, అనిల్ కుమార్ రెడ్డి, మాలినీ రెడ్డిలు చెన్నైలో నివసిస్తారని విషయం అందరికీ తెలుసునని, వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి కుమార్తె హర్షిని రెడ్డికి రెండు ఓట్లు ఉన్నాయని అన్నారు.
ఓటరు జాబితాలో ఆమె ఫోటోతో కూడిన రెండు ఓట్లను మీడియా ప్రతినిధుల ముందు రఘురామకృష్ణ రాజు గారు ప్రదర్శించారు. తెలంగాణ కోడలిని అంటూ అక్కడ సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్న వై.యస్. షర్మిల రెడ్డి గారికి, బ్రదర్ అనిల్ గారికి కూడా పులివెందులలోనే ఓటు హక్కు ఉందన్నారు. తమకు కావలసిన వారికి మాత్రం ఓటు హక్కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలని, ఐటీ నిపుణులకు మాత్రం రాష్ట్రంలో ఓటు హక్కు ఉండవద్దని అనడం ఎంత వరకు సమంజసమని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. దొంగ ఓట్ల నమోదు ప్రక్రియకు పేటెంట్ హక్కులన్నీ తన ప్రస్తుత పార్టీకే దక్కుతాయని, దొంగే దొంగ అన్నట్లుగా తామే దొంగ ఓట్లను నమోదు చేసి, ఇతరులపై నిందలు వేసే ప్రయత్నాన్ని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.