ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం డిసెంబర్ రెండవ తేదీన తుఫాన్గా మారనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
డిసెంబర్ 3,4, 5, 6 తేదీలలో కోస్తాంధ్ర మరియు రాయలసీమలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుఫాను కోస్తాంధ్ర వైపు పయనిస్తే తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. కోతకు వచ్చిన పంటలను వెంటనే కోసి భద్రపరుచుకోవాలని రైతులకు అధికారులు సూచించారు. ఇక అటు తెలంగాణలోను భారీ వర్షాలు కురువనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం రోజున నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.