తానుపట్టుకున్న కుందేలుకు మూడు కాళ్లేనని తాను నమ్మి.. జనాల్ని నమ్మించడంలో ఆరితేరిన నాయకు డు ఎవరైనా ఉంటే.. ఆయన ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే అంటున్నారు సోషల్ మీడియా జనాలు. నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వను!-అనే డైలాగు ఎవరు పుట్టించారో తెలియదు కానీ.. చంద్రబాబు నోటి నుంచి జాలువారిన క్షణం నుంచి ఆయనకేమైనా అయిందా ? అనే సటైర్లు పేలాయి. అవసరం ఉన్నా లేకున్నా.. తనను తాను కీర్తించుకోవడం.. పని ఉన్నా లేకున్నా.. ప్రతి విషయాన్నీ రాజకీ యం చేయడం బాబుకు రాజకీయంగా అబ్బిన విద్య అంటారు తమ్ముళ్లు..!!
ఇక, ఇప్పుడు చంద్రబాబు కాదు.. ఆయన జూమ్ బాబు! అనే సటైర్లు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. అంతేకాదు.. మరికొందరు అధికారం లేకున్నా.. జూమ్ జామ్‌గా చంద్రబాబు రెచ్చిపోతున్నారే అని కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంతకీ ఇది ఎందుకు వచ్చింది ? ఎందుకు అలా కామెంట్లు కుమ్మరిస్తున్నారు ? అంటే.. కరోనా నేపథ్యంలో కీలక రాజకీయ నాయకులు.. వారి కార్యక్రమాలు అన్నీ బ్రేకు పడ్డాయి. ఈ క్రమంలో వయసు దాదాపు 70 ఏళ్లు ఉన్న నేపథ్యంలో కరోనా నేపథ్యంలో ఆయన ఇంటికే పరిమితమవుతారని అందరూ అనుకున్నారు.
పైగా నిత్యం తీరిక లేకుండా ఏదో ఒక విషయంతో తమకు క్లాసిచ్చే చంద్రబాబుకు రెస్ట్ దొరికింది కాబట్టి.. తాము కూడా రెస్ట్ తీసుకోవచ్చని తమ్ముళ్లు కూడా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా చంద్రబాబు మాత్రం.. జూమ్ యాప్‌ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఠంచనుగా ఆయన జూమ్ యాప్ ముందుకు వచ్చేస్తున్నారట. మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్విరామంగా ప్రసంగాలు చేస్తున్నారు. గతంలో జిల్లా నేతలతో సమావేశాలు పెట్టిన ఆయన ఇటీవల కాలంలో మండల స్థాయి నేతలతోనూ మీటింగులు పెట్టారంటే.. జూమ్ ప్రభావం ఎంత ఉందో తెలుస్తోంది.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జూమ్ యాప్‌ను ఎవరు ఎక్కువగా వాడుతున్న ఫేమస్ రాజకీయ నాయకులు ఎవరు ? అనే విషయం పరిశీలనకు వచ్చినప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబేనని తెలిసిందట..! దీంతో ఆ విషయాన్ని జూమ్ నిర్వాహకులే వెల్లడించారు. హమ్మయ్య మా ఆశయం తీర్చారు అంటూ.. బాబును పొగడ్తలతో ముంచెత్తారట. ఈ విషయం తెలిసిన సోషల్ మీడియా.. బాబును జూమ్ బాబు అంటూ.. సటైర్లతో కుమ్మేస్తోందట..!
-vuyyuru subhash