ఏపీ ఉద్యోగులకు శుభ వార్త..పోస్టుల విభజనపై మార్గదర్శకాలు విడుదల

-

కొత్త జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల కేటాయింపు, పోస్టుల విభజనకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త జిల్లాల్లో ఈ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు ఆప్షన్ ఫార్మ్ లను జారీ చేసింది. వీటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది సీఎస్ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి కమిటీ. ఏప్రిల్ 2 ఉగాది నాటి నుంచి కొత్త జిల్లాల్లోని పునర్వవస్థీకరించిన ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లు పనిచేయడం ప్రారంభిస్తాయని పేర్కోన్న ప్రభుత్వం… ఏప్రిల్ 2 తేదీని జిల్లాల పునర్వవస్థీకరణకు సంబంధించి అప్పాయింటెడ్ డే గా పేర్కోంటూ ఆదేశాలు జారీ చేసింది.

కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా వనరులు, ఉద్యోగుల శాశ్వత విభజనకు కొంత సమయం పడుతుందని ఉత్తర్వుల్లో పేర్కోన్న ప్రభుత్వం… కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజిన్లలో ప్రభుత్వ విధులు సాఫీగా జరిగేందుకు తాత్కాలికంగా ఉద్యోగులు, పోస్టులు, వనరుల కేటాయింపు అవసరమని స్పష్టం చేసింది. తాత్కాలిక కేటాయింపుల కోసం రాష్ట్ర, ప్రాంతీయ, జోనల్, మండల, గ్రామ స్థాయిలోని కార్యాలయాలు, పోస్టుల విభజన, కేటాయింపు ఉండబోదని స్పష్టం చేసింది.

జిల్లా, డివిజన్ స్థాయిలోని ఉద్యోగులను మాత్రమే తాత్కాలిక ప్రాతిపదికన కేటాయింపు ఉంటుందని తెలిపింది. ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల అంశాన్ని ఆర్ధిక శాఖ పర్యవేక్షిస్తుందని పేర్కోన్న ప్రభుత్వం… కొత్త జిల్లాలకు ఆర్డర్ టు సర్వ్ పేరిట తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులు జారీ అవుతాయని స్పష్టం చేసింది. ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వుల తర్వాత ఉద్యోగులు ఒకచోట నుంచి మరో చోటుకు వెళ్లే అవకాశమున్నందున బదిలీలపై నిషేధం ఉత్తర్వులను సడలించనున్నట్టు పేర్కోన్న ప్రభుత్వం… కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా తాత్కాలిక ప్రాతిపదికనే కొత్త జిల్లాలకు కేటాయించనున్నట్టు స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news