మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బిజెపికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కు లేఖ రాశారు. పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పారు. వ్యక్తిగత కారణాలతో బిజెపిలో కొనసాగలేక పోతున్నానని చెప్పారు రావెల. కాగా రావెల కిషోర్ బాబు కొంత కాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే రావెల కిషోర్ బాబు మళ్ళీ టిడిపి గూటికి చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఆయన ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జరిగే మహానాడులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతారనే వార్తలు కూడా వెలువడ్డాయి. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు మరికొన్ని రోజుల్లోనే తెలియనున్నాయి. ఇక గతంలో రావెల కిషోర్ బాబు ఐఆర్టిఎస్ అధికారిగా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో రావెలకు చోటు దక్కింది. అయితే రావెల కిషోర్ బాబు కారణంగా పార్టీకి ఇబ్బందులు ఏర్పడ్డాయని పార్టీ నాయకత్వం భావించింది. దీంతో మంత్రి వర్గం నుండి రావెల కిషోర్ బాబు ను చంద్రబాబు తొలగించారు. దీంతో మనస్తాపం చెందిన రావే లో కొంత కాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తర్వాత 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు జనసేన పార్టీలో చేరారు. అయితే.. ఆ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిరోజులకే జనసేన నుండి బీజేపీలో చేరారు. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన సొంత గూటికి తిరిగి రావాలని చూస్తున్నారు అనే ప్రచారం సాగుతోంది.