ఏపీ ప్రజలకు ఊహించని షాక్ తగిలింది. ఏపీలో మరో మూడు రోజులు కరెంట్ కోతలు ఉండనున్నట్లు.. విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తిరుపతిలోని.. చంద్రగిరిలో అప్రకటిత కరెంట్ కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో గంటల తరబడి విద్యుత్ కోతలు ఎదురవుతున్నాయి.
వారం రోజులుగా తిరుపతిలోని పల్లెల్లో అంధకారం నెలకొంది. వ్యవసాయ, చిన్న తరహా పరిశ్రమలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరో రెండు, మూడు రోజులు కోతలు తప్పవంటున్నారు విద్యుత్ అధికారులు. ఇది ఇలా ఉండగా…తాజాగా కరెంట్ కోతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏపీ కరెంట్ కష్టాలు త్వరలోనే తీరనున్నాయని ప్రకటన చేశారు విజయసాయిరెడ్డి.
త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో 6 అణు విద్యుత్ రియాక్టర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని స్పష్టం చేశారు. రాజ్యసభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారని విజయసాయి చెప్పారు.