చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో.. లోకేశ్‌ పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆందోళనకు దిగుతున్న టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ముఖ్య నేతలు ఇల్లు కదలకుండా గృహనిర్బంధం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారింది. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

యువగళం పాదయాత్రకు లోకేశ్‌ కొన్ని రోజులపాటు విరామం ఇవ్వనున్నారు. పాదయాత్ర శుక్రవారం నాటికి డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడకు చేరుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుని పోలీసులు అరెస్టు చేయడంతో… శనివారం ఉదయం లోకేశ్‌ హుటాహుటిన బయల్దేరి విజయవాడ చేరుకున్నారు. అప్పటి నుంచి న్యాయనిపుణులతో సంప్రదిస్తూ బిజీబిజీగా ఉన్నారు. చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండు విధించడంతో… పరిస్థితులు చక్కబడేంత వరకూ పాదయాత్రను తాత్కాలికంగా ఆపనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పరిస్థితులు సర్దుకున్నాక మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తారని సమాచారం.

మరోవైపు తన తండ్రి అరెస్టుపై లోకేశ్ స్పందిస్తూ.. తప్పుచేయని తన తండ్రిని అరెస్టు చేయడం చూస్తుంటే తన రక్తం మరుగుతోందని అన్నారు. ‘ఈ రోజు ద్రోహంలా అనిపిస్తోంది. మా నాన్న పోరాటయోధుడు. నేను కూడా అంతే. ఏపీ కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం తిరుగులేని శక్తితో మేం ఎదుగుతాం. ఈ యుద్ధంలో నాతో చేరమని మిమ్మల్ని కోరుతున్నా’ అని లోకేశ్‌ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news