ఏపీలో దిశ, దశ లేని ప్రభుత్వం పాలన చేస్తుందని.. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే.. ఏకైక ప్రత్యామ్నాయం బిజెపి, జనసేన మాత్రమేనని చెప్పారు సోము వీర్రాజు. రెండు నెలల క్రితమే అమిత్ షా మాకు ఈ విషయం పై దిశానిర్దేశం చేశారని.. వలంటీర్ వ్యవస్థతో ప్రజాస్వామ్య వ్యవస్థను సీఎం నాశనం చేశారని ఆగ్రహించారు. ఈ వలంటీర్ వ్యవస్థకి ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ ద్వారా అమలవుతున్న శక్తి కేంద్రమని.. మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించాలన్నారు.
కేంద్రం ఇచ్చే నిధులను మళ్లించి జగన్ కూడా తన పధకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని.. 14, 15వ ఆర్దిక సంఘం నుంచి గ్రామాల అభివృద్ధికి మోడీ నిధులు కేటాయించారని పేర్కొన్నారు. సర్పంచుల ఆధారంగా నిధులు ఇస్తున్న శక్తి నరేంద్ర మోడీ అని.. ప్రజలకు ఇచ్చే రూ. 1 కిలో బియ్యం ఖర్చు కేంద్రానిదేనని వెల్లడించారు. ఇంకా మధ్యాహ్న భోజన పధకం, స్కూల్ యూనిఫాం, పాఠశాలలు అభివృద్ధికి మోడీ నిధులిచ్చారని.. జగన్ నవరత్నాలిస్తే… మోడీ డజన్ల కొద్దీ రత్నాలు ఇచ్చారని చెప్పారు. జగన్ పధకాలకు అప్పులు చేసి.. అప్పులు పుట్టని పరిస్థితికి వచ్చారని.. మూడు వేల కోట్లతో రాష్ట్రంలో రోడ్లు వేస్తామని కేంద్రం చెప్పిందన్నారు.