ఇవాళ అయోధ్యకు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు తరలి వెళ్ళనున్నాయి. ఈనెల 22వ తేదీన అయోధ్య రామ మందిరం ప్రారంభం ఉన్న నేపథ్యంలో శ్రీవారి లడ్డూలను తీసుకుపోనున్నారు. ఏకంగా లక్ష లడ్డూలను తరలిస్తున్నారు అధికారులు. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారుచేసిన శ్రీవారి లడ్డు ప్రసాదం ప్రత్యేక కార్గో విమానంలో అయోధ్యకు వెళ్లనుంది. ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను తిరుమల శ్రీవారి సేవ సదన్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి శుక్రవారం సాయంత్రం తరలించారు.
ఇవాళ సాయంత్రం రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్యకు లడ్డూలు వెళ్ళనున్నాయి. ఏకంగా 350 పెట్టెలలో ప్యాక్ చేసి నేరుగా ఏరో గ్రూప్… ద్వారా ప్రత్యేక కార్గో విమానంలో అయోధ్యకు రవాణా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూలను అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేస్తున్నట్లు వీరబ్రహ్మం తెలిపారు. ఇక అయోధ్యకు వెళ్ళిన తిరుమల శ్రీవారి లడ్డూలను భక్తులకు ఉచితంగానే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి లక్షల్లో భక్తులు రానున్నారు. ఈ మేరకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు.