ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. దీనిపై వివిధ వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతుంది. సుప్రీంకోర్టు తీర్పుపై తాజాగా ఏపీ విద్యాశాఖ, ఐటీ మంత్రి నారా లోకేష్ తాజాగా స్పందించారు. ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అని మంత్రి లోకేష్ తెలిపారు. 30 ఏళ్ల క్రితం చంద్రబాబు సామాజిక న్యాయాన్ని అమలు చేశారని నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం వల్ల అనేక మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామని నారా లోకేశ్ స్పష్టం చేశారు. అన్ని సామాజిక వర్గాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి టీడీపీ పార్టీ ఎజెండా అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.