రాజమహేంద్రవరం కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెళ్లారు. బాబును ములాఖత్ అయ్యాక మీడియాతో మాట్లాడారు. గత నాలుగున్నరేళ్లుగా ఏపీలో అరాచక పాలన చూస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించేందుకే వచ్చానని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
‘ఇవాళ్టి ములాఖత్ ఆంధ్రప్రదేశ్‌కు చాలా కీలకమైంది. జనసేన, తెలుగుదేశం కలిసే వెళ్తాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసే వెళ్తాయి. ఏపీ భవిష్యత్ కోసమే జనసేన- టీడీపీ కలయిక. ఇది మా ఇద్దరి కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసమే. వైకాపాను సమష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది. చంద్రబాబు రాజకీయవేత్త… జగన్ ఆర్థిక నేరస్థుడు. సైబరాబాద్ నిర్మించిన వ్యక్తిని జైల్లో పెట్టడం బాధాకరం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలనే నా ఆకాంక్ష. వైసీపీ నేతలు మాపై రాళ్లు వేసే ముందే ఆలోచించుకోవాలి. రాళ్లు వేసిన ఎవరినీ వదిలిపెట్టము’. అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.