టిడిపి అధినేత నారా చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టి, అన్యాయంగా జైలులో పెట్టడం బాధాకరమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గురువారం రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయిన తరువాత పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. చంద్రబాబుకి సంఘీభావం ప్రకటించేందుకే ఇక్కడికి వచ్చామన్నారు.
ఇక పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికలలో జనసేన – టిడిపి కలిసే పోటీ చేస్తాయని ప్రకటించారు. విడివిడిగా పోటీ చేస్తే వైసిపి అరాచకాలను ఎదుర్కోలేమన్నారు. చంద్రబాబుతో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు కానీ ఆయన అనుభవానికి కాదని అన్నారు. అందుకే 2014 ఎన్నికలలో టిడిపి తో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. దేశానికి బలమైన నాయకుడు కావాలనే తాను ఆలోచిస్తానని అన్నారు. తాను ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్ళనని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
హైటెక్ సిటీని నిర్మించిన వ్యక్తి 317 కోట్ల స్కాన్ చేశారంటే ఎవరు నమ్మరని అన్నారు. ప్రస్తుతం తాను ఎన్డీఏ లో ఉన్నానని.. 2024 లో ఈ అరాచక పాలన నుంచి బయటపడాలంటే టిడిపి, జనసేన, బిజెపి కలిసి వెళ్లాలని తన కోరిక అన్నారు. బిజెపి దీనిపై పాజిటివ్ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబును ఈడీ విచారించాలి కాని రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ కేసులో మోపిన వ్యక్తి ఓ ఆర్థిక నేరగాడని.. జగన్ చేసేవన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలేనని మండిపడ్డారు.