ఆ తమ్ముళ్లు సైలంట్ గా ఉన్నారా… సైడైపోయారా?

-

అమరావతిలోనే పూర్తి రాజధాని ఉండాలని చంద్రబాబు సుదీర్ఘ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పేరుకి రైతుల పోరాటమే అయినా కర్త, కర్మ, క్రియ టిడిపి నే అయ్యి ఈ అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తుందన్న విషయం బహిరంగ రహస్యమే! అయితే అమరావతిలోనే రాజధాని ఉండాలనేది ఏపీ వాసులందరి కోరికా కాదనే సంగతి కాసేపు పక్కనపెడితే… ఇది గుంటూరు – కృష్ణా జిల్లాల టీడీపీ నేతల కోరికా లేక యావత్ టీడీపీ నేతల కోరికా? ఇప్పుడు ఏపీలో వినిపిస్తున్న పెద్ద ప్రశ్న ఇది!

175 నియోజకవర్గాల్లో, 302 మండల కేంద్రాల్లో, 620 గ్రామాల్లో జై అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని, తుళ్లూరు నుంచి షికాగో వరకూ ఈ ఉద్యమం విస్తరించిందని టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. నలుగురు కలిసి నల్లచొక్కాలు వేసుకుని గ్రూపు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రాన్న మహాదీక్ష అయిపోదని వైకాపా నాయకుల సెటైర్ల సంగతి తెలిసిందే. మరి ఈ ధర్నాలోనూ, మహా దీక్షలోనూ పాల్గొన్న టీడీపీ నేతలు ఎందరు అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న!

పత్రికల్లో రాస్తేనో, సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనో ఉద్యమం ఆ రేంజ్ లో ఉన్నట్లు కాదని.. అలా చూపించి ఏదో జరిగిపోతుందనే భ్రమలు కల్పిస్తున్నారని కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో విదేశాల్లో దీక్ష సంగతి కాసేపు పక్కన పెడితే… సి.ఆర్.డి.ఏ పరిధిలోని గుంటూరు, విజయవాడల్లోని కొన్ని చోట్ల తప్ప మరెక్కడా ఈ విషయంలో టీడీపీ నేతలు యాక్టివ్ గా పాల్గోలేదని అంటున్నారు. ఈ విషయంలో ఉత్తరాంధ్ర నేతలు, సీమ టీడీపీ నేతలు గైర్హాజరయ్యారని అంటున్నారు! అంటే… ఇక్కడ ఎవరి ప్రాంతం గురించి వాళ్లు ఆలోచిస్తున్నారే తప్ప.. టీడీపీలో అందరి నేతలకు కూడా అమరవతిలోనే పూర్తి రాజధాని ఉండాలనే ఆలోచన లేనట్లుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!

ఈ విషయంలో కేవలం అమరావతి పేరుచెప్పి నడిచిన రియల్ ఎస్టేట్ కి సంబందించిన నేతలే కీలకంగా మారి హడావిడి చేస్తున్నారు తప్ప… మిగిలిన ప్రాంతాల్లోని టీడీపీ నేతలు రాజధాని పేరు చెప్పి పరిపాలనా వికేంద్రికరణ జరగాలనే కోరుకుంటున్నారనే విషయం సుస్పష్టం అవుతుందని అంటున్నారు విశ్లేషకులు!! మరి ఈ మహాదీక్షలో సైలంట్ గా ఉన్న నేతలు అంతా బాబుకు చెప్పే సైలంట్ గా ఉన్నారా? లేక ఈ విషయంలో మమ్మల్ని ఇన్ వాల్వ్ చేయొద్దని సైడ్ అయిపోయారా అనేది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news