తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. శ్రీవారి వాహన సేవలో పాల్గొంటూ భక్తులు పారవశ్యం పొందుతున్నారు. ఆ వేంకటేశ్వరుని నామస్మరణతో తిరుమాఢవీధులన్నీ మార్మోగుతున్నాయి. ఎటుచూసినా ఆధ్యాత్మక భావంతో ఆ ప్రాంగణమంతా దేదీప్యమానంగా వెలుగులీనుతోంది.
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం రోజున శ్రీవారికి మధ్య హనుమంత వాహన సేవ నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు శ్రీవారికి మధ్య హనుమంత వాహన సేవ జరపనున్నారు. సాయంత్ర 4 గంటల నుంచి 5 గంటల మధ్య స్వర్ణ రథోత్సవం.. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య గజవాహన సేవ ఉండనుంది. మరోవైపు ఐదో రోజైన శుక్రవారం రాత్రి శ్రీమలయప్పస్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఏడు గంటలకు వాహన మండపం నుంచి ప్రారంభమైన వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ వాహన సేవను దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు తిరుమలకు తరలివచ్చారు.