ఏపీలోని తిరుమలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు తెలంగాణలో దొరికారు. కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఈ ముగ్గురి ఆచూకీ లభించింది. ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కామారెడ్డి పోలీసులు ఏపీ పోలీసులు, పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
అసలేం జరిగిందంటే.. ఏడో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బుధవారం సాయంత్రం తిరుమలలో అదృశ్యమయ్యారు. స్థానిక ఆర్బీసీ సెంటర్‌లో నివాసముంటున్న ఎస్.కృష్ణ కుమారుడు ఎస్.చంద్రశేఖర్(13), యోగేష్ కుమారుడు వైభవ్ యోగేష్(13), జి.శ్రీవర్దన్(13) తిరుమలలోని ఎస్వీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. బుధవారం రోజున మధ్యాహ్నం భోజన సమయంలో ఇంటికి వెళ్లి పాఠశాలలో జరుగుతున్న పరీక్షకు తిరిగి హాజరుకాలేదు. గమనించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు తమ పిల్లల కోసం చుట్టుపక్కలంతా గాలించారు. అయినా ఆచూకీ దొరక్కపోవడంతో తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సీసీ కెమెరాలు పరిశీలించగా విద్యార్థులు ల్యాప్‌టాప్‌లతో తిరుమల నుంచి ఆర్టీసీ బస్సులో తిరుపతికి చేరుకున్నట్లు గుర్తించినట్లు ఎస్‌ఐ సాయినాథ్ చౌదరి తెలిపారు.
మరోవైపు కామారెడ్డిలో ముగ్గురు విద్యార్థులు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు వారిని ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. వారు చెప్పే సమాధానాలు కూడా అనుమానాస్పదంగా ఉండటంతో పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.