విజయవాడ దుర్గమ్మ రధం ఘటన మీద స్పందించిన వెల్లంపల్లి !

దుర్గగుడిలో వెండి రథంలో మూడు సింహాలు మాయం అయిన ఘటన కలకలం రేపుతోంది. అయితే సింహాలు మాయం కాలేదని రికార్డులు పరిశీలిస్తామని ఈవో సురేష్ బాబు పేర్కొన్నారు. అంతర్వేది ఘటన జరిగింది కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ లు వస్తున్నాయని అంటున్నారు ఈవో. రికార్డుల పరిశీలన కోసం మూడు రోజుల సమయం కావాలని ఈవో పేర్కొన్నారు. ఈ సంధర్భంగా దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రధానికి భద్రత కల్పించే చర్యల్లో భాగంగా అధికారులు కార్పెట్ ని తెరిచి చూసే సమయంలో సింహాలు కనిపించలేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రథాన్ని ఉపయోగించలేదని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం హయాంలో జరిగిందో ఇప్పుడు జరిగిందో విచారణలో తేలుతుందని అన్నారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని ఆయన పేర్కొన్నారు. సెక్యూరిటీ ఏజెన్సీ కి దేవాలయం భద్రతా అప్పగించామని, సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతాలోపం అని తేలితే అయితే దానిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయన్న ఆయన అంతర్వేది ఘటన తరువాత అన్ని దేవాలయాల్లో భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.