హైదరాబాద్ అభివృద్ధిపై విజయ సాయిరెడ్డి ప్రశంసలు కురిపించారు. ఐక్యరాజ్య సమితి తాజా అంచనాల ప్రకారం కర్ణాటక రాజధాని బెంగళూరు అత్యధిక జనాభా ఉన్న మొదటి నాలుగు నగరాల్లో స్థానం సంపాదించింది. తెలుగు రాష్ట్రం తెలంగాణ రాజధాని హైదరాబాద్ భారతదేశంలో జనాభా రీత్యా ఆరో అతిపెద్ద నగరంగా అవతరించిందన్నారు. అలాగే ప్రపంచ సంపన్నుల జాబితాలు రూపొందించే హెన్లీ అండ్ పార్టనర్స్ సంస్థ అధ్యయనం ప్రకారం బెంగళూరు, హైదరాబాద్ లో అపర కుబేరుల సంఖ్య వేగంగా పెరుగుతోందని వివరించారు.
30 ఏళ్ల క్రితం, అంతకు ముందు దేశంలో మహానగరాలు అంటే ఢిల్లీ, బొంబాయి (ముంబై), కలకత్తా, మద్రాసు (చెన్నై) పేర్లే చెప్పేవారు. బ్రిటిష్ వారి పాలనాకాలంలో వీటిలోని మూడు నగరాలు వాటి పేరుతో ఉన్న 3 ప్రెసిడెన్సీలకు (కలకత్తా, మద్రాసు, బొంబాయి) రాజధానులు. 1911లో బ్రిటిష్ పాలకులు దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి తరలించాలని నిర్ణయించాక నాలుగో పెద్ద నగరంగా హస్తిన అవతరణకు పునాది పడింది. ఇవి పాలనా రాజధానులుగానే గాక, పారిశ్రామిక కేంద్రాలుగా శతాబ్దాలపాటు సేవలందించాయి. ఐరోపా దేశాల పారిశ్రామిక విప్లవం కూడా కలకత్తా, మద్రాసు, బొంబాయి నగరాల అభివృద్ధికి కాణమైంది. పారిశ్రామిక విప్లవం, ఆంగ్లేయుల పాలన– చెన్నై, ముంబై, కోల్‌కత్తా నగరాల ప్రగతికి దోహదం చేస్తే, 20వ శతాబ్దంలో పాశ్చాత్య ప్రపంచంలో మొదలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విప్లవం, అంతకు ముందు ఔషధాల తయారీ రంగంలో వచ్చిన మార్పులు, ఫార్మాస్యూటికల్ సెక్టర్ లో భారతీయ నిపుణులు సాధించిన నైపుణ్యాలు బెంగళూరు, హైదరాబాద్ అనూహ్య అభివృద్ధికి ఇంధనంగా మారాయని వెల్లడించారు సాయిరెడ్డి.