పార్లమెంటు భవనంతో భారత ప్రజాస్వామ్యానికి కొత్త బలం – విజయసాయిరెడ్డి

-

కొత్త పార్లమెంటు భవనంతో భారత ప్రజాస్వామ్యానికి కొత్త బలం అన్నారు విజయ సాయిరెడ్డి. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో 2023 మే 28 ఆదివారం సుదినం. మరచిపోలేని రోజు. 1927 నుంచి ఉపయోగిస్తున్న ప్రస్తుత పార్లమెంటు భవనం పక్కనే నిర్మించిన కొత్త సన్సద్‌ భవన్‌ ప్రారంభమౌతున్న సందర్భం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆహ్వానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్న ఈ కొత్త విశాల, అధునాతన భవంతి భావి తరాలు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నిర్మించారని వెల్లడించారు.

అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 2020 డిసెంబర్‌ 10న మొదలైన ఈ త్రిభుజాకార భవనం నిర్మాణం 2023 మే 20న పూర్తయింది. ఆదివారం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రిటిష్‌ వారి హయాంలో పాత సన్సద్‌ భవన్‌ నిర్మాణానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. కొత్త నిర్మాణం రికార్డు స్థాయిలో మూడేళ్ల లోపే పూర్తయింది. సెంట్రల్‌ విస్టా రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా 65 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త భవనం నిర్మించారు. గతంలో చేసిన రాజ్యాంగ సవవరణ చట్టం వల్ల 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల సేకరణ ప్రాతిపదికగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని వివరించారు.

అప్పుడు పెరిగే పార్లమెంటు సభ్యుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కొత్త భవనాన్ని ఎక్కువ మంది కూర్చుని విధులు నిర్వర్తించే విధంగా మరింత విశాలంగా తీర్చిదిద్దారు. కొత్త భవనంలోని లోక్‌ సభ సభ్యులు సమావేశమయ్యే చాంబర్లో 888 మంది, రాజ్యసభ చాంబర్లో 384 మంది సభ్యులు కూర్చోవడానికి అనువుగా ఏర్పాట్లు చేశారు. ఇంకా లోక్‌ సభ చాంబర్లో ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తే మొత్తం 1272 మంది సభ్యులు కూర్చుని విధులు నిర్వర్తించడానికి వీలు కల్పించారు. ఇదివరకు సంయుక్త సమావేశాలు పాత భవనంలోని సెంట్రల్‌ హాలులో నిర్వహించేవారు గాని అక్కడ కేవలం 440 మంది కూర్చోవడానికే అవకాశముండేది. రూ.862 కోట్ల వ్యయంతో 4 అంతస్తులు, 39.6 మీటర్ల ఎత్తులో ఈ కొత్త భవంతిని కేంద్ర ప్రజా పనుల శాఖ నిర్మించిందన్నారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news