మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. సిబిఐ తన వాదనలను వినిపించింది. విచారణకు అవినాష్ రెడ్డి సహకరించడం లేదని.. ఎప్పుడు నోటీస్ ఇచ్చినా మూడు, నాలుగు రోజుల సమయం అడుగుతూ వస్తున్నాడని తెలిపింది. ఇక ముందస్తు బెయిల్ కోసం అని కోర్టుల చుట్టూ తిరుగుతూ పిటిషన్లు వేస్తున్నారంటూ సిబిఐ తరఫున లాయర్ కోర్టుకు విన్నవించారు.
నిన్న అవినాష్, సునీత తరపు లాయర్ల వాదనలు విన్న కోర్టు.. నేడు సీబీఐ తరఫు లాయర్ వాదనలు ఆలకించింది. అయితే అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యం కారణంగా ఆయనను బుధవారం వరకు అరెస్టు చేయకుండా సిబిఐ ని ఆదేశించాలని అవినాష్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు బుధవారం వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని సిబిఐ ని ఆదేశించింది.