గౌతమ్ అదానీ వ్యవహారంపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భారత బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీలు ఇప్పుడు చిక్కుకున్న సంక్షోభం భారతదేశంలో సంస్థాగత సంస్కరణలు రావడానికి దోహదం చేస్తుందన్నారు. అంతేకాదు, ఇండియాలో ప్రజా స్వామ్యం పునరుద్ధరణకు ఈ పరిణామం ప్రేరేపిస్తుందని భావిస్తున్నాను,’ అని అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ జార్జి సొరోస్ అన్న మాటలు నిజంగా భారతీయులకు తీవ్ర అభ్యంతరకరం అని పేర్కొన్నారు.
ఎందుకంటే, దేశంలో పార్లమెంటరీ ప్రాజాస్వామ్యాన్ని, ప్రజాతంత్ర వ్యవస్థలను, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే సత్తా భారతీయులకు ఉంది. ఈ విషయంలో ఇతరుల జోక్యం, ‘సహకారం’ వారికి అవసరం లేదు. తూర్పు ఐరోపా దేశం హంగరీ నుంచి అమెరికా వచ్చి స్థిరపడిన హెడ్జ్ ఫండ్ మేనేజర్, మహాదాత, షార్ట్ సెల్లర్ అయిన సొరోస్ ఇలా మాట్లాడడం వాస్తవానికి భారత అంతర్గత ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకోవడమే అవుతుందని వివరించారు.
శుక్రవారం జర్మనీ నగరం మ్యూనిక్ లో ప్రారంభమౌతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సుకు ఒక రోజు ముందు ప్రసంగిస్తూ, ‘హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూపు కష్టాల్లో పడింది. దీని వల్ల భారత ప్రధాని మోదీ కూడా బలహీనమయ్యే అవకాశం ఉంది, ’ అని సొరోస్ జోస్యం చెప్పడం ఏ మాత్రం సబబు కాదు. ఒక అంతర్జాతీయ ఇన్వెస్టర్ హోదాలో– హిండెన్ బర్గ్ నివేదికపైనా, అదానీ గ్రూపు కంపెనీల తీరుతెన్నుల పైనా ఏమైనా మాట్లాడే స్వేచ్ఛ సొరోస్ కు ఉందిగాని, అదానీ గ్రూపునకు భారత ప్రధాని మోదీకి, ఇంకా భారత ప్రజాస్వామ్యం నాణ్యతకూ ముడిపెట్టి ఆయన మాట్లాడడం గర్హనీయం. అవాంఛనీయం కూడా. భారత వ్యాపార దిగ్గజాలు చేసే పొరపాట్లు, నేరాలను విచారించి, వాటిని సరైన మార్గంలో పెట్టే ప్రభుత్వ, రాజ్యాంగ వ్యవస్థలు దేశంలో సమర్ధంగా పనిచే స్తున్నాయని తెలిపారు విజయసాయి రెడ్డి.