విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 15 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది. దసరాలో మొదటిసారిగా శ్రీ మహాచండి దేవి దర్శనం ఉంటుందని దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు శంకర్ శాండిల్య తెలిపారు. అక్టోబర్ 15 వ తేదీన ఉత్సవాల తొలిరోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.
అక్టోబర్ 16 న శ్రీ గాయత్రీ దేవి అలంకారం, 17 న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం, 18 న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం, 19 న శ్రీ మహా చండీ దేవి అలంకారం, 20 న శ్రీ సరస్వతీ దేవి అలంకారం, మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి, 21 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం, 22 న శ్రీ దుర్గాదేవి అలంకారం, 23న ఉత్సవాల ఆఖరు రోజున రెండు అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. ఉదయం శ్రీ మహిషా సురమర్ధనీ దేవి అలంకారం.. మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం.. సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు.
దసరా ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ. ఇంజనీరింగ్ వర్క్ కోసం 2.5 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. గత ఏడాది 16 లక్షల లడ్డూలు కొనుగోలు చేశారన్నారు. ఈసారి 20 లక్షల లడ్డూలు తయారు చేయబోతున్నామని.. కేశ ఖండనశాలలో 600 మంది క్షురకులను బయట నుండి తీసుకోబోతున్నామన్నారు.