విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భారీగా తరలి వస్తున్న భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా భవానీ దీక్షల విరమణ క్రతువు ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున భవానీలు కనక దుర్గమ్మ సన్నిధికి తరలి వస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొని భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై భక్తులకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించారు. ఇందులో భాగంగానే భవానీలు గిరిప్రదక్షిణ చేసి వినాయకుడి గుడి నుంచి దర్శనం క్యూలైన్లో ప్రవేశించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. భవానీలు ఇరుముడిని అమ్మవారికి సమర్పించిన అనంతరం మల్లేశ్వరాలయం మెట్ల మార్గం ద్వారా మల్లికార్జున మహామండప ప్రాంగణానికి చేరుకుని ఆ తర్వాత హోమగుండాల్లో నేతి కొబ్బరికాయను సమర్పిస్తారు. అనంతరం గురుస్వామి వద్ద మాల తీయడంతో దీక్ష విరమణ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది దీక్షాధారులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.