అక్రమ మైనింగ్, మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసుల్లో రాజస్థాన్, ఝార్ఖండ్‌లోని 12 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచి సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మీడియా సలహాదారు అభిషేక్ ప్రసాద్ ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. హజారీబాగ్ డీఎస్పీ రాజేంద్ర దూబే నివాసంలోనూ తనిఖీలు జరుగుతున్నట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
జార్ఖండ్, రాజస్థాన్‌లో సాహిబ్ గంజ్ జిల్లా కలెక్టర్‌కు చెందిన ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఈడీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మనీలాండరింగ్ కేసుతో సంబంధముందని ఆరోపిస్తూ హేమంత్ సోరెన్‌కు గతంలో ఈడీ పలుసార్లు నోటీసులు జారీ చేసింది. వీటిని తిరస్కరిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీనిపై జార్ఖండ్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సోరెన్‌కు మరో అవకాశమిస్తూ ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది.