విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో 100ల మందిపైగా గాయలయ్యాయని వెల్లడించారు. విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలును కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు వెనుక నుంచి ఢీ కొట్టడంతో రాయగడ రైల్లోని బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మరికొన్ని బోగీలు పట్టాలు తప్పాయి.
అక్కడే మరో ట్రాక్‌పైనున్న గూడ్సు రైలు బోగీలపైకి అవి దూసుకెళ్లడంతో అక్కడ భీతావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. క్షతగాత్రులను విశాఖ, విజయనగరం ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో పలాస రైలులో వెనుక బోగీ ఆనుకుని ఉన్న గార్డు ఎంఎస్ రావు మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే రాయగడ రైలు ఇంజిన్‌లో ఉన్న ఇద్దరు లోకో పైలెట్లు మరణించినట్లు వెల్లడించారు.
మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించింది. మరోవైపు మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ప్రధాని ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.