కర్ణాటక – ఆంధ్ర జీవనాడి అయిన తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తుంగభద్ర నుంచి 3 రోజులుగా లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. నీటి వృథాను అరికట్టేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాత్కాలిక గేటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముందుగా స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేసి నీటి వృథాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాత్కాలిక గేటు ఏర్పాటు కోసం నిపుణులను తీసుకువచ్చారు.
మరోవైపు ఇవాళ తుంగభద్ర డ్యామ్ వద్దకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెళ్లనున్నారు. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన 19వ గేటును పరిశీలించనున్ారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అదే విధంగా తుంగభద్ర డ్యామ్‌ను ఇవాళ ఏపీ మంత్రులు నిమ్మల, పయ్యావుల పరిశీలించనున్నారు. డ్యామ్ గేట్ల పటిష్టత, మరమ్మతులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సోమవారం రోజున నీటిపారుదల నిపుణుడు కన్నయ్య నాయుడు డ్యామ్ గేట్లను పరిశీలించిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.