ఏపీలో రెండేళ్ల తరువాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. వైసీపీ పోరు ఒంటరిగానే ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, వైసిపి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ వైసీపీతో పొత్తు పెట్టుకుంటుందని చర్చ జరిగిన నేపథ్యంలో సాయి రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు.
ఓటమి భయంతోనే కొందరు పొత్తులు పెట్టుకుంటారని టిడిపి, జనసేన వంటి విపక్షాలను ఉద్దేశించి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా వైసీపీ విజయాన్ని ఆపలేరన్నారు. మరో 20, 25 ఏళ్లు అధికారంలో ఉంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని, ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత లేదన్నారు. అధికారం ఆయన వదులుకోలేని, ఆయనను ప్రజలే వద్దనుకున్నారని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు.